19-04-2021 09:25:41 About Us Contact Us
“మెగా ప్రిన్ సెస్” “సూర్యకాంతం” “నిహారిక కొణిదెల” పుట్టిన రోజు ప్రత్యేకం.!

“మెగా ప్రిన్ సెస్” “సూర్యకాంతం” “నిహారిక కొణిదెల” పుట్టిన రోజు ప్రత్యేకం.!బుల్లి తెర పై యాంకర్ గా పరిచయమై.. వెబ్ సిరీస్ తో సామాజిక మాధ్యమం లో భారీ విజయం సాధించి.. వెండితెర పై నటించి.. తన ప్రతిభ తో తెరపై.. తన చలాకీతనం తో బుల్లి తెరపై.. గడించిన ఆరున్నర సంవత్సరాలుగా అటు పిల్లలు నుండి ఇటు పెద్దల వరకు బాగా చేరువైన తెలుగమ్మాయి.. కొత్త పెళ్ళి కూతురు.. మెగా ప్రిన్ సెస్ కొణిదెల నిహారిక.అలాంటి నిహారిక.. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.


మెగా కుటుంబం నుండి అప్పటికే అనేకమంది హీరోలు తెరంగేట్రం చేశారు… కానీ.. తొలిసారి ఒక్క అమ్మాయి 2014 మార్చ్ 19న బుల్లి తెర పై డాన్స్ షో లో వ్యాఖ్యాతగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఆమె.. మెగా బ్రదర్ నాగబాబు గారి గారాల పట్టి.. నిహారిక కొణిదెల. అచ్చ తెలుగులో.. గల..గలా మాట్లాడుతూ..పిల్లల షో అయినప్పటికీ.. యాంకరింగ్ తొలి సారి చేస్తున్నప్పటికీ.. తన మాటలతో.. తన అల్లరి చేష్టలతో.. షో ని చాలా బాగా నడిపించారు.అలా రెండవ సీజన్ ముగిసే సమయానికి.. మంచి హోస్ట్ గా పేరు సంపాదించుకున్నారు నిహారిక.అటు పిల్లలకు.. ఇటు పెద్దలకు బాగా దగ్గరయ్యారు.అక్కడితో ఆగలేదు.. వెబ్ సిరీస్ అంటూ యువతను సైతం తన వైపు తిప్పుకున్నారు.


2015 లో యూట్యూబ్ లో తనకంటూ ఒక ఛానల్ ప్రారంభించదమే కాకుండా.. పింక్ ఎలిఫెంట్ అనే నిర్మాణ సంస్థ ను ప్రారంభించారు.తాను నిర్మించిన తొలి వెబ్ సిరీస్ “ముద్ద పప్పు.. ఆవకాయ..” లో హీరోయిన్ గా నటించారు. తెలుగులో యూట్యూబ్ కేంద్రంగా భారీ విజయం అందుకున్న తొలి వెబ్ సిరీస్ గా ముద్దపప్పు ఆవకాయ పేరు గడిచింది.అప్పటి వరకు తెలుగులో లఘు చిత్రాలు మాత్రమే వచ్చేవి.. ఆ విజయంతో వెబ్ సిరీస్ లు ప్రారంభమయ్యాయి.ఇలా సామాజిక మాధ్యమ చరిత్రలో చెరిగిపోని రికార్డులను తన పేరిట లిఖించారు నిహారిక.నటిగా వెండితెర వైపు అడుగులు వేసిన నిహారిక తన సంస్థలో రెండవ వెబ్ సిరీస్ గా.. తండ్రి నాగబాబు గారితో కలిసి “నాన్న కూచి” లో నటించారు. తాజాగా మ్యాడ్ హౌస్ అనే వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు..తన నిర్మాణ సంస్థ ద్వారా.. ఇలా కొత్త వారికి అవకాశం కల్పిస్తూన్నారు.ఇంతటితో సంతృప్తి చెందలేదు నిహారిక.. అప్పటికే పలు సినీ కుటుంబాలకు చెందిన అమ్మాయిలు వెండితెర పై నటించాలని ముందుకు వచ్చినా.. కొందరికి సాధ్యపడలేదు.. మరి కొందరు కేవలం ఒక సినిమా తో ఆగిపోయారు.అలా అనేక సినీ కుటుంబాల నుండి ప్రయత్నించి వదిలేసిన ఆ వెండితెర పై “ఒక మనసు” సినిమా తో మెగా ప్రిన్ సెస్ గా అడుగు పెట్టడమే కాక.. “సూర్యకాంతం”గా విజయాలు సాధించారు.నటిగా విమర్శకుల ప్రశంసలు పొందారు.తమిళంలో సైతం నటించారు.. విజయ్ సెట్టుపతి గారి సినిమాలో తన నటనకు అక్కడా మంచి పేరు లభించింది.. “మెగాస్టార్ చిరంజీవి” గారి ప్రతిష్టాత్మక చిత్రం “సైరా..నర్సింహ రెడ్డి” సినిమాలో పాత్ర దక్కించుకోవడమే కాక.. ఉన్నది కాసేపైనా.. సినిమాలో తన మార్క్ ను విడిచారు.. ప్రక్షకుల నుండి కితాబులు పొందారు.అలా తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక పేజీని రాసేసుకున్నారు నిహారిక.


వ్యక్తిగతంగా తాను ఎప్పుడు.. మెగా కుటుంబం నుండి వచ్చిన కొణిదెల నిహారిక లా ఉండేందుకు ఇష్టపడలేదు. పరిశ్రమకు వచ్చిన ఒక తెలుగు అమ్మాయిగా.. నిహారికగా మెలిగారు.అది బలి తెర షో సెట్ లోనైనా.. వెబ్ సిరీస్ చిత్రీకరణలో ఐనా.. సినిమా షూటింగ్ అయినా.. లేదా ఏదైనా సినీ వేడుకలోనైనా.. ఆమె అందరినీ అలరించడమే చూశాము తప్ప.. ఎక్కడా గర్వం.. అహం తన దగ్గర కనపడలేదు.అనేక సందర్భాలలో అతి దగ్గర నుండి చూసిన నేను..ఇటీవల జరిగిన రెండు సంఘటలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.లాక్ డౌన్ తర్వాత నాగబాబు గారు ప్రారంభించిన షో.. “ఖుషి ఖుషిగా”.. ఒక రోజు ఆ సెట్ కి వెళ్ళాను.అక్కడ నిహారిక గారు సైతం ఉన్నారు.షాట్ గ్యాప్ లో నాగబాబు గారు తన వ్యక్తిగత సిబ్బందిలో ఎవరినో అరిచారు.. దాంతో సెట్ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది.అది గమనించిన నిహారిక వెంటనే తండ్రిని అరవద్దు అని చిన్నగా చెప్పారు.. తానే ఒక జోక్ వేసి మళ్ళీ తిరిగి సెట్ ని నవ్వించింది.తరవాత నాగబాబు గారు సైతం అరేయ్ మీరంతా ఇలా బయపడితే ఎలా.. నేను ఏదో.. వేరే గోలలో వున్నాను అని అన్నారు.అలానే ఇటీవల నిహారిక గారి రిసెప్షన్ వేడుక జరిగింది.వేడుక అనంతరం.. తన భారీ దుస్తుల కారణంగా కార్ ఎక్కేందుకు చాలా కష్టపడుతున్నారు.. ఆ సమయంలో అక్కడ ఒక అత్యుత్సాహుడు ఫోటో దిగేందుకు ప్రయత్నిస్తున్నాడు.. అది చూసిన నిహారిక..”బ్రదర్.. నేను ఏం చేస్తున్నా.. నువ్వేం చేస్తున్నావు”అని అన్నారు.వెంటనే అక్కడ వారు ఆ అబ్బాయిని పక్కకు లాగారు.కానీ.. లోపల కూర్చున్న తర్వాత సదరు కుర్రాడికి సెల్ఫీ ఇచ్చి వెళ్లారు.ఇలా అనేక సినిమా వేడుకలలో నిహారిక ప్రవర్తన చూసి నేను ఆశ్చర్యానికి లోనైనవి కోకొల్లలు.


చిన్నతనంలోనే యాంకరింగ్ చేసి సొంతగా సంపాదించడం ప్రారంభించిన నిహారిక.. ఈ ఆరున్నర సంవత్సరాలలో ఆమె వేసిన ప్రతి అడుగు.. నేటి తరం అమ్మాయిలకు స్ఫూర్తి దాయకం.ముఖ్యంగా సినిమా రంగం వైపు అడుగు వేసే అమ్మాయిలకు ఆమె ఒక రోల్ మోడల్.కొత్త జీవితం ప్రారంభించిన నిహారిక గారికి శుభాకాంశాలు తెలుపుకుంటూ.. ఇలా ఎప్పుడు ఎనర్జీ తో అందరినీ అలరించాలని.. సినిమా రంగంలో నటిగానో.. యాంకర్ గానో.. నిర్మాతగానో.. మళ్ళీ తనదైన ఎంట్రీ ఇవ్వాలని.. కొత్త ప్రతిభను తన నిర్మాణ సంస్థ ద్వారా పరిచయం చెయ్యాలని కోరుకుంటు.. మా బి.ఆర్.మూవీ జోన్ తరపున.. మెగాభిమానుల తరపున.. పుట్టిన రోజు శుభాకాంక్షలు.!