25-01-2022 15:47:06 About Us Contact Usశ్రీను వైట్ల.. ఈ పేరు తెలియని తెలుగు వారు వుంటారేమో కానీ.,ఆయన సినిమాలు చూడని వారు ఉండరు.అలానే ఆ సినిమా పేర్లు చెప్పగానే అందరికి ఏదో ఒక హాస్య సన్నివేశం గుర్తుకు వస్తుంది.. వారు ఆ సన్నివేశాన్ని చెబుతూ నవ్వుతూ వుంటారు.దూకుడు వంటి సినిమాలకు తన పారితోషికం విడుదలకు ముందు తీసుకోకుండా తన సినిమా పట్ల తనకున్న నమ్మకం చాటుకున్న దర్శకులు.నేడు.. అంతలా 1999 నుంచి మన అందరినీ వినోదం లో ముంచేసిన శ్రీను వైట్ల గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఈ కథనం.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. ఈస్ట్ గోదావరి జిల్లా.. కండులపాలెం అనే ఊరిలో 1972న జన్మించారు శ్రీను వైట్ల.చిన్నతనం నుండి సినిమాలను అమితంగా ప్రేమించారు..విపరీతంగా సినిమాలు చూడడటం మొదలు పెట్టారు. బాగా చదువుకొని,ఉద్యోగం చేయమని ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా.. వినకుండా,వ్యవసాయం చేశారు శ్రీను వైట్ల తండ్రి గారు.అలాంటి వ్యక్తి తనయుడుగా శ్రీను వైట్ల సినిమా మీద ఇష్టంతో డిగ్రీని తొలి సంవత్సరమే చదవకుండా కాకినాడ నుండి చెన్నై బయలుదేరారు.ఇంట్లో వాళ్ళు కాలేజీ ఫిజు,బట్టలు,పుస్తకాలకు ఇచ్చిన 1500 రూపాయలతో మద్రాస్ చేరిన ఆ 18 ఏళ్ళ కుర్రాడు దర్శక విభాగం లో అవకాశం కోసం అనేక పాట్లు పాడారు.


చివరకు,బాలకృష్ణ గారి సినిమాకి దర్శక విభాగంలో చేరారు,సినిమా ఆడకపోవడంతో ఆ దర్శకుడికి మళ్ళీ అవకాశం రాలేదు.అంతలో శివ సినిమా చూసి రామ్ గోపాల్ వర్మ దగ్గర పని చేసేందుకు హైదరాబాద్ బయల్దేరారు వైట్ల.హైదరాబాద్ చేరిన శ్రీనుకు అర్జీవి దగ్గర అవకాశం దొరకడం అసాధ్యం అని భావించి.. సీనియర్ దర్శకుడిగా పేరు పొందిన సాగర్ వద్ద చేరారు.అక్కడే వి.వి.వినాయక్ గారితో కలిసి పని నేర్చుకున్నారు.అనేక సంవత్సరాల అనుభవం తర్వాత తొలి సినిమా దర్శక అవకాశం లభించింది.అపరిచితుడు అనే టైటిల్ తో రాజశేఖర్ హీరోగా సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.. ఆర్థిక ఇబ్బందులతో సినిమా ఆగిపోయింది.దింతో బాగా కుంగిపోయారు వైట్ల.1999లో కేవలం 32లక్షల్లో దాదాపు ఐదుగురు నిర్మాతలతో ఒక చిన్న సినిమా చేశారు.అదే మాస్ మహరాజ్ రవితేజ తో చేసిన నీకోసం.సినిమా చూసిన రామోజీరావు గారు ఆయన సినిమాను తానే తీసుకొని పెద్దగా విడుదల చెయ్యడంతో పాటు మరో సినిమా అవకాశం కూడా ఇచ్చారు.తొలి సినిమాతో విమర్శకుల ప్రశంసలు,నంది అవార్డులు అందుకున్న శ్రీనుకి తన మిత్రులు,ఎక్కడా ఒక్క కామెడీ సన్నివేశం లేదు అని చెప్పిన మాటలు బాగా ఆలోచింపచేశాయి.దాంతో ఎంటర్టైన్మెంట్ వైపు అడుగులు వేసిన శ్రీనుకి తిరుగు లేదు.ఆనందం,సొంతం,వెంకీ వంటి విజయాలతో స్టార్ దర్శకుల జాబితాలో చేరిపోయారు.మెగాస్టార్ చిరంజీవి గారి అందరివాడు సినిమా చేసి టాప్ దర్శకులలో ఒక్కరిగా గుర్తింపు పొందారు.ఢీ..దుబాయ్ శ్రీను.. రెడీ వంటి వరస విజయాలతో అగ్ర కథానాయకుల నుండి అవకాశాలు లభించడం మొదలయ్యాయి.నాగార్జున గారితో కింగ్,వెంకీ గారితో నమో వేంకటేశా.!,మహేష్ బాబు తో దూకుడు,తారక్ తో బాద్ షా చెయ్యడంతో పాటు భారీ విజయాలు నమోదు చేశారు.ఇటీవల చరణ్ తో బ్రూస్ లీ.. వరుణ్ తేజ్ తో మిస్టర్,రవితేజ తో మూడవ సినిమాగా అమర్..అక్బర్..ఆంటోనీ చేశారు.


ఇలా దాదాపు టాప్ హీరోలు అందరితో సినిమాలు చేసిన శ్రీను వైట్ల తనదైన కామెడీ పంచ్ లతో ప్రతి ఇంటిలో నవ్వులు పూయించారు..ముఖ్యంగా ఆయన సినిమాల్లో బ్రహ్మానందం గారి కామెడీ అందరిని బాగా నవ్వించాయి.హీరో ఇమేజ్ తగ్గకుండా ఫామిలీ ఆడియాన్స్ కు బాగా చేరువయ్యారు.వరస విజయాల్లో వున్నా తక్కువ పారితోషికం తీసుకోవడం,బడ్జెట్ పెరగడంతో,తన సినిమా మీద నమ్మకంతో విడుదల తర్వాత పారితోషకం తీసుకోవడం వంటివి శ్రీను వైట్లకే చెందాయి.అలాంటి శ్రీను వైట్ల గారు నేడు 48వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మా బి.ఆర్.మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు…!

త్వరలో శ్రీను వైట్ల గారు మరో బ్లాక్ బస్టర్ సినిమా తీయాలని కోరుకుంటూ..