24-01-2022 15:25:20 About Us Contact Usఆరు అడుగులా రెండు అంగుళాల ఎత్తు కలిగిన దెబ్బయి ఏళ్ళు పైబడిన వ్యక్తి మనకు ఎదురైతే ఎలా ఉంటారు.!?నడుము ఒంగిపోయి.. మందగించిన చూపుతో.. వారికి ఉన్న చాదస్తంతో చెప్పిందే చెబుతూ.. పెద్దవాడిని కనుక అన్ని తెలుసు అని అహంకారంతో మాట్లాడుతుంటారు.. అలానే ఉంటారు అని ఒక వ్యక్తిని నేను రెండు సంవత్సరాల ముందు కలిశాను.. మేము ఎవరో తెలియకుండానే కూర్చోపెట్టి.. మాతో దాదాపు రెండు గంటల పాటు సంభాషించారు. చూపు స్పష్టంగా ఉంది.. అడుగులు వెయ్యడంలో.. చేతల్లో.. చాలా చురుకుగా ఉన్నారు. ఉస్మానియాలో చదివి.. ఆనాటి రాజకీయాల్లో పాలుగున్న విద్యార్థి.. సినీ రంగంలో నిర్మాతగా వచ్చి.. దర్శకుడిగా మారి విజయాలు అందుకున్న స్టార్.. పరిశ్రమకు సమస్య వస్తే.. తనే పరిశ్రమ గొంతుగా మారిన సినీరంగ ప్రముఖుడు.. అపారమైన తెలివి.. వయసుకు తగ్గిన అనుభవం.. ఇన్ని ఉంది కూడా మాతో ఆయన ఒక సాధారణ వ్యక్తిగా ఓపికగా మేము చెప్పింది విన్నారు. ఆయనే తమ్మారెడ్డి భరద్వాజ గారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు..


1948లో కమ్యూనిస్ట్ కుటుంబంలో జన్మించారు భరద్వాజ్ గారు. ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి ఉద్యమ కారణంగా రాష్ట్రం విడిచి వెళ్ళమనడంతో చెన్నై చేరిన తన తండ్రి.. విద్య రంగం నుండి సినిమా రంగం వైపు అడుగులు వేశారు.. సారధి స్టూడియోస్ లో చేరి.. ఆ తర్వాత నిర్మాతగా మారారు.. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించి తొలి సినిమా ఎన్టీఆర్ తో లక్షాధికారి అనే సినిమా చేశారు. అలా నిర్మాతగా మారిన ప్రజా నాట్య మండలి సభ్యుడు తమ్మారెడ్డి కృష్ణ మూర్తి. ఆయన కుమారుడే భరద్వాజ గారు. పరిశ్రమతో పాటు హైదరాబాద్ చేరిన భరద్వాజ.. ఓయూ లో ఇంజనీరింగ్ చదివారు. కమ్యూనిస్ట్ కుటుంబంలో జన్మించడంతో యూనివర్సిటీ రాజకీయాల్లో చురుగ్గా పాలుగున్నారు.


ఇటీవల సినిమాగా వచ్చిన జార్జ్ రెడ్డికి మిత్రుడు భరద్వాజ్ గారు.. అలాంటి విప్లవ భావాలు ఉన్నా భరద్వాజ నిర్మాతగా సినిమా రంగంలో అడుగు పెట్టారు. 1979లో కోతల రాయుడు సినిమాతో నిర్మాతగా మారిన ఆయన.. 1989లో మన్మధ సామ్రాజ్యం సినిమాతో దర్శకుడిగా మారారు. రెండవ సినిమాగా తాను ఓయూ లో చూసిన గొడవల ఆధారంగా అలజడి అనే సినిమా తీశారు. ఆ సినిమా ఆనాడు తెలుగు నేల పై నిజంగానే అలజడి సృష్టించింది. అలా అటు దర్శకుడిగా 18 .. ఇటు నిర్మాతగా 15 సినిమాలు చేశారు. 1994లో చిత్ర పరిశ్రమ చేసిన స్ట్రైక్ లో పరిశ్రమ గొంతుకగా మారారు భరద్వాజ గారు. ఆ రోజుల్లో నన్ను అలా ముందుకు నెట్టారు అని ఆయన చెప్పుకున్నా.. ఆయన సమర్థుడు కనుకనే అలా ముందుకు రాణించారు అన్నది వాస్తవం.ఇప్పటికి చిత్ర పరిశ్రమలో ఎటువంటి సమస్య వచ్చినా అందరికి ముందుగా గుర్తుకొచ్చే మొదటి వ్యక్తి భరద్వాజ గారు. చిన్న పేరు వచ్చినా సమాజంలో జరిగే విషయాల పై స్పందిస్తే మనల్ని నలుగురూ ఏమనుకుంటారో అని మాట్లాడకుండా ఉండే ఈ రోజుల్లో.. సమాజంలో జరిగే ఏ విషయం పట్ల నైనా.. తన గొంతును నిర్మొహమాటంగా చెప్తారు భరద్వాజ గారు. ఆనాడు విద్యార్థిగా తెలంగాణ పోరులో పాలుగున్నా.. మొన్న ప్రత్యేక హోదా కోసం ఆంధ్రాలో రోడ్ ఎక్కినా.. ప్రజలకు ఇది అవసరం అని నమ్మి అడుగు ముందుకు వేస్తుంటారు. పరిశ్రమలో ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిన వ్యక్తి. అందరికి ఈ వయసులో సైతం అందుబాటులో ఉంటుంటారు భరద్వాజ గారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిప్రాయాన్ని నిత్యం ప్రజలతో పంచుకుంటుంటారు భరద్వాజ గారు.


గత సంవత్సరం తెలుగులో అనువాదించిన తమిళ సినిమా ఆమె. ఆ సినిమా తెలుగులో ఆయన సమర్పణలో విడుదలైంది. అలానే ఇటీవల విడుదలైన పలాస 1978 సినిమా సైతం ఆయన సమర్పణలోనే విడుదలైంది. సమాజానికి మంచి చెప్పే ఏ సినిమాకైనా తనదైన సహాయం చెయ్యడం ఆయన అలవాటు అనేందుకు ఈ రెండు సినిమాలు ఉదాహరణలు. మా లాంటి ఎందరో యువకులకు ఆయన స్ఫూర్తి. అలాంటి ఆయన గురించి రాస్తుపోతే పుస్తకామే అవుతుంది. అందుకే కేవలం కొన్ని విషయాలను మాత్రమే ఇక్కడ చెప్పుకొచ్చాము.


నేడు దెబ్బయి రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్న తమ్మారెడ్డి భరద్వాజ గారు ఇలానే ఉత్సాహంగా పరిశ్రమలో మరిన్ని సంవత్సరాలు ఉండాలని కోరుకుంటూ.. మా బి.ఆర్.మూవీ జోన్ బృందం తరపున జన్మదిన శుభాకాంశాలు.