24-01-2022 16:57:00 About Us Contact Usకృష్ణా నగర్.. ఈ పేరు తెలియని తెలుగు వారు పెద్దగా ఉండరు.అందులో సినిమా గురించి ఏ మాత్రం అవగాహన ఉన్న ఎవరికైనా కృష్ణానగర్ తెలుసు.హైదరాబాద్ లో ఉన్న ఈ కృష్ణానగర్ ఇలా తెలుగువారందరికి సినిమా వారు ఉండే చోటుగా తెలుసు.ఇప్పటికే అనేక మంది ఫిల్మ్ నగర్.. జూబ్లీ హిల్స్.. మణికొండ.. చిత్రపురి కాలనీ.. అంటూ వెళ్లిపోయినా.. కృష్ణానగర్ మాత్రం ఎప్పుడు సినిమా రంగం వారితో కళ కళ లాడుతుంటుంది..!మరి ఇప్పుడు కృష్ణానగర్ గురించి ఎందుకంటే..!?


కెమెరా..లైట్..సెట్ డిపార్ట్మెంట్ నుండి ఎడిటింగ్.. దబ్బింగ్ స్టూడియో వరకు దాదాపు 24 క్రాఫ్ట్స్ లో పని చేసే వారు కృష్ణానగర్ లో ఉంటారు.వారం మొత్తం పొద్దున్న ఆరు నుండి సాయంత్రం దాక అలిసిపోయి.. ఎవరి జీవితాలలో వారు బిజీ బిజీ గా ఉంటారు.అలాంటి కృష్ణానగర్ కు ఒక ఆదివారం సాయంత్రం 4 గంటల తర్వాత వెళితే కేఫ్ లు దగ్గర.. సందుల్లో ఒకటే కోలాహలంగా ఉంటుంది.వారం మొత్తం పని చేసి అలిసిపోయిన కళాకారులు.. సినీకార్మికులు.. ఆదివారం పగలు విశ్రాంతి తీసుకొని.. సాయంత్రం మిత్రులను కలిసేందుకు బయటకు వస్తారు.కుటుంబ సభ్యులకు దూరంగా ఉండే వీరు మిత్రులకే కదా కష్టసుఖాలు చెప్పుకునేది.


అగ్ర కథానాయకుల సినిమాల నుండి కొత్తవారితో చేస్తున్న చిన్న సినిమా వరకు సెట్ లో జరిగిన అన్ని విషయాలు ఇక్కడ మిత్రులతో పంచుకుంటూ.. శుక్రవారం విడుదలైన సినిమా హిట్ అయిందా.. లేదా.. దానికి గల కారణాలు విశ్లేషిస్తూ.. పరిశ్రమలో వచ్చిన మార్పులను.. వారి అనుభవాలను కొత్తగా పరిశ్రమకు వచ్చిన వారికి వివరిస్తూ.. ఇలా ఏ కేఫ్ లో చూసినా.. ఏ హోటల్ లో చూసినా.. ఏ సందులో చూసినా అందరూ.. సినిమా విషయాలు మాట్లాడుతూ కనిపిస్తారు.సరదాగా జోకులు వేసుకుంటూ.. చాలా రోజులు తర్వాత కనపడిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ.. ఇప్పుడు తానే సినిమా చేస్తున్నాడో తెలుసుకుంటూ.. తిను ఏ సినిమా కు పని చేస్తున్నాడో చెప్తూ కనపడుతారు.


నిజంగా ఆదివారం సాయంత్రం కృష్ణానగర్ కు కొత్తవారు ఎవరైనా వెళ్తే.. సినిమా ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. మనకు తెలియని ఎన్నో విషయాలు అక్కడ తెలుస్తాయి.చిత్ర పరిశ్రమ గురించి తెలియాలని కుతూహలం ఉన్న ఎవరైనా ఒక ఆదివారం కృష్ణానగర్ కు వెళ్తే.. సినిమా ఎంత గొప్పదో.. ఎంతమందికి అన్నం పెడుతుందో..ఒక రెండున్నర గంటలు వినోదం పంచడానికి ఎంతమంది ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది.అలాంటి కృష్ణానగర్ ఇప్పుడు ముగబోయింది.లాక్ డౌన్ విధించిన తొలి రోజుల్లో.. ఉహించకుండా వచ్చిన విరామంలో అందరూ కలిసి కబుర్లు చెప్పుకున్నారు.పాత మిత్రులను కలుసుకున్నారు.. కొత్తవారితో పరిచయాలు చేసుకున్నారు.రోజులు గడిచే కొద్ధి.. వారిలో ఆందోళన పెరిగింది.అసలు ఏమి జరుగుతుంది.. ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియక కొంత భయపడ్డారు.కుటుంబ సభ్యులను కలిసేందుకు చాలా మంది ఎలాగోలా సొంత ఊరికి వెళ్లిపోయారు.సినిమా షూటింగ్స్ గురించి సినీ ప్రముఖులు.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవడంతో తిరిగి వచ్చేందుకు కొందరు సిద్ధపడితే.. కొందరు వచ్చేశారు.మరి కొంతమంది ఇక్కడే ఉన్నారు.


ఎన్నో ఆశలతో.. మరెనో సందేహాలతో సినిమా రంగంలోకి అడుగు పెట్టాలని హైదరాబాద్ లోని కృష్ణానగర్ చేరి.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ వారం మొత్తం కష్టపడి.. ఆదివారం కష్టసుఖాలను మిత్రులతో చెప్పుకునే ఆ సినీ కళాకారులు.. కార్మికులు ఇప్పుడు కనపడటం లేదు.అక్కడదక్కడా సీరియల్స్.. టెలివిజన్ కార్యక్రమల షూటింగ్ ప్రారంభం కావడంతో కొంతమంది కనిపిస్తున్నారు.


నిన్న ఆదివారం అక్కడకు వెళితే ఒక్కరి మొహంలో కూడా ఆనందం కనపడటం లేదు.మిత్రులు ఎప్పుడు వస్తారో.. అనే దిగులు.. కుటుంబ సభ్యుల గురించి భయం.. మొత్తం మీద మునుపటి రోజులు ఎప్పుడు వస్తాయా అని.. ఎదురు చూస్తున్న మొహాలు మాత్రమే కనిపించాయి. భవిషత్తు మీద ఆశ కన్నా.. ప్రస్తృత పరిస్థితి పోతే చాలు అనే మాటలే వినిపించాయి.అందుకే అంటున్నా
కృష్ణానగర్ కళ తప్పింది.!పూర్వవైభవం ఎప్పుడో మరి??
తిరిగి అంతా మాములుగా మారి.. త్వరలో నా తోటి సినీ పరిశ్రమ (కుటుంబ) సభ్యులు.. కృష్ణానగర్ చేరి వారి నవ్వులు వినిపించాలని కోరుకుందాం..!