24-01-2022 17:12:29 About Us Contact Us


నేడు ‘ప్రపంచ రంగస్థలదినోత్సవం’,అలాంటి ఈ రోజున సరిగ్గా 35 సంవత్సరాల క్రితం,అంటే 1985,మార్చ్27న మద్రాస్ లో ‘పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి’,’సురేఖ’ గార్ల దంపతులకు ఒక్క మగ బిడ్డ జన్మించాడు,చెన్నైలోనే తన విద్యాభ్యాసం ప్రారంభించి,ఊటీలో చదువు పూర్తి చేశాడు.ఆ తర్వాత 2007లో యువకులందరిలానే తన తండ్రి,బాబాయిలు ఉన్న రంగంలో అడుగు పెట్టాడు.అప్పుడే తెలుగువారికి ఆ పేరు తెలిసింది,నాటి నుండి నేటి వారకు ఆ పేరు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారి నోట వినిపిస్తూనే ఉంది.అతనే 2007లో ‘చిరుత’ సినిమాతో తెరంగేట్రం చేసి,రెండవ సినిమాకే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘మగధీరుడు’,’కొణిదెల’ వంశ వారసుడు,’మెగా పవర్ స్టార్ రామ్ చరణ్’.

అది 2007వ సంవత్సరం,అప్పటికే రెండు దశాబ్దాల నుండి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కటవ స్థానం పై కూర్చున ‘అన్నయ్య’ ‘ఇంద్రసేనుడు చిరంజీవి’ ఒక పక్క,దశాబ్దం నుండి ‘తొలిప్రేమ’,’బద్రి’,’ఖుషి’ వంటి సినిమాలతో యావత్తు తెలుగు నాట ఉన్న యువతను ఉర్రుతలు ఊగిస్తున్న ‘తమ్ముడు’ ‘పవన్ కళ్యాణ్’ మరో పక్క.మధ్యలో అర్దదశాబ్దం క్రితం వచ్చి ‘ఆర్య’,’హ్యాపీ’ అంటూ హిట్లు కొడుతు ఆ సంవత్సరంలో ‘దేశముదురు’ అంటూ పెద్ద హిట్ అందుకున్న ‘బన్నీ’.ఇటువంటి మెగా కుటుంభం నుండి వారసుడు వస్తున్నాడు అనగానే.!చిరంజీవి,బన్నీలలా డాన్సులు వెయ్యగలడా?పవన్ కళ్యాణ్ లా మ్యానరిజం ఉంటుందా అంటూ అనేక ప్రశ్నలు.తొలి సినిమా ‘చిరుత’ తో జవాబు ఇచ్చాడు ‘రామ్ చరణ్ తేజ్’.డాన్స్,ఫైట్స్ అదిరిపోయాయి,ఇక పూరి జగన్నాథ్ క్యారెక్టర్ కనుక అందరికి ఎక్కేసింది,ఎంతలా అంటే చిన్న పిల్లాడు కూడా సినిమా నుంచి బయటకు వస్తు ,అడివి నాదే,వేటా నాదే, చిరుతా..,’ అని అరిచేంతలా..!

అంతలో 2008లో మెగాస్టార్ చిరంజీవి సినీ రంగంలోని సింహాసనం వీడి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు.ఆ సంవత్సరం చరణ్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు.మళ్ళీ చరణ్ 2009 జులై 31న రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ అనే భారీ బడ్జెట్ సినిమాతో వచ్చాడు.ఈ సారి రెండు పాత్రలతో తెలుగు చిత్ర పరిశ్రమకు గుర్తుండిపోయే హిట్ కొట్టాడు,దేశం మొత్తం ‘మగధీర’ ప్రకంపనలు సృష్టించింది. యాక్టింగ్,డాన్స్,ఫైట్స్,గుర్రపు సవారీ,ఇలా ఒక్కటి ఏంటి అన్ని రంగాల్లో చరణ్ శభాష్ అనిపించాడు.మావయ్య అల్లు అరవింద్ కు కాసుల వర్షం కురిపించింది.ఆ తర్వాత గీతా ఆర్ట్స్ ఆ సినిమాను రెండు సంవత్సరాలకి అంటే 2011లో తమిళం,మాలయంలో కూడా విడుదల చేశారు.అన్నయ్య చిరంజీవి కి సినీ వారసుడు అంటూ,అన్నయ్య సినిమాలు లేని లోటును భర్తీ చేసేందుకే వచ్చాడు అంటూ మెగాభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

అంత పెద్ద సినిమా తర్వాత చరణ్ ‘ఆరంజ్’ లాంటి ఒక లవ్ స్టోరీలో చక్కగా ఒదిగిపోయాడు.ఆరంజ్ సినిమా పాటలు ఇప్పటికీ మనం వింటూనే ఉంటాం,ఇక ఆ సినిమాతో చరణ్ లవర్ బాయ్ గా మారిపోయాడు,అమ్మాయిలకు చరణ్ అంటే ఎంత పిచ్చో సామాజిక మాధ్యమాలు చూస్తే తెలుస్తుంది.,.వెంటనే పక్క కమర్షియల్ ఎలెమెంట్స్ తో ‘రచ్చ’ సినిమా చేసి బాక్స్ ఆఫీస్ ని ‘రచ్చ రచ్చ’ చేశాడు.’నాయక్’,’ఎవడు’,’బ్రూస్ లీ’,’ధ్రువ’ వంటి సినిమాలతో మాస్ ప్రేక్షకులకు కి బాగా దగ్గరయ్యాడు చరణ్.మధ్యలో ‘జంజీర్’ తో హిందీలో కూడా ఒక సినిమా చేశాడు,’గోవిందుడు అందరివాడే’ అనే సినిమాతో ఫామిలీ ఆడియాన్స్ కి చేరువయ్యాడు.అటు మాస్ ఇటు క్లాస్ సినిమాలతో హిట్స్ అందుకున్న చరణ్ స్టార్ హీరోగా ఎడిగిపోయాడు.చిరంజీవి కొడుకు అనే స్థాయి నుండి చరణ్ తండ్రి అని నేటి తరం చెప్పుకునే స్థాయికి వచ్చాడు.తన కంటూ ప్రత్యేక అభిమానులను పొందారు.

సినిమాలు హిట్లు కొడుతున్నా ఎక్కడో మెగాభిమానులకు తృప్తి లేదు,ఇవేవీ చరణ్ స్థాయి హిట్స్ కాదు అనేది వారి అభిప్రాయం,సరిగ్గా అప్పుడే సుకుమార్ తో కలిసి రంగస్థలం చేశాడు.పక్కా పల్లెటూరి కథ,అందులోనూ హీరో కి వినపడదు,సాధారణంగా స్టార్ హీరోలు ఇలాంటి సినిమాలు చేయడానికి ఆలోచిస్తారు,అయినా కథ పట్ల సుకుమార్ పట్ల నమ్మకంతో ముందుకు అడుగేశాడు చరణ్.ఈ సినిమా మొత్తం తెలుగు సినిమా వసూళ్ల లెక్కలు మరోసారి మార్చేసింది.నాడు మగధీర,నేడు రంగస్థలంతో తెలుగు సినిమా మార్కెట్ ని మరో మెట్టు ఎక్కించాడు చరణ్.తన నటనకి అటు పరిశ్రమ ఇటు ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు.ఇప్పుడు మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో ‘యంగ్ టైగర్’ ‘జూనియర్ ఎన్టీఆర్’ తో కలిసి ‘ఆర్.ఆర్.ఆర్’ తో 2021 సంక్రాంతికి రానున్నాడు.

తండ్రి కోసం కొత్త అవతారం:-

తన తండ్రి రాజకీయాల్లోకి వెళ్తే ఒక సినిమా మాత్రమే చేసిన చరణ్,తన తండ్రి కోసం సినీ భవిషత్తు గురించి ఆలోచించకుండా ప్రచారంలో తన వంతు బాధ్యత నిర్వర్తించాడు.తిరిగి తన తండ్రి దాదాపు దశాబ్దం తర్వాత సినిమాల్లోకి వస్తుంటే,ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో అనే ఆలోచన లేకుండా తానే ప్రొడ్యూసర్ అవతారం ఎట్టి ‘ఖైదీ 150’ చేశాడు.తండ్రికి మర్చిపోలేని బహుమతి ఇవ్వాలి అని తలచి,150 సినిమాలు చేసిన చిరంజీవికి నచ్చిన పాత్ర నరసింహారెడ్డి కథను భారీ తారాగణంతో ఖర్చుకు వెనకాడకుండా,లాభమా,నష్టమా అని లెక్కలు వెయ్యకుండా ‘సైరా’ అంటూ దేశ స్థాయి సినిమా నిర్మించాడు.ఇక తండ్రి కొడుకులు కలిసి ‘మగధీర’,’ఖైదీ 150′,’బ్రూస్ లీ’ లలోని కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించినా చూసేందుకు చాలా బాగుంది.వీరిద్దరి కలిసి చేసిన డాన్స్,హార్స్ రైడ్ ఎప్పటికి మరువలేనిది.

బాబాయ్ కి తోడుగా:-

చరణ్,పవన్ కళ్యాణ్ మధ్య ప్రేమ బాబాయ్,అబ్బాయి కంటే అన్నా,తమ్ముడులా కనిపిస్తూ ఉంటుంది.మగధీర కోసం వీరిద్దరూ చేసిన ఇంటర్వ్యూలో వీరి మధ్య బంధం ఎలాంటిదో అర్ధమవుతుంది,అలానే రంగస్థలం హిట్ ని పవన్ కళ్యాణ్ ఎంత గర్వపద్దాదో మనకు తెలిసిందే.ఇక ‘నాయక్’ ఆడియో విడుదల కార్యక్రమంలో “బాబాయ్ దగ్గరకు వెళ్ళాలి అంటే ముందు నన్ను దాటాలి” అంటూ చరణ్ ఫైర్ అవ్వడం నాడు టాక్ ఆఫ్ ది స్టేట్ అయింది.బాబాయ్ రాజకీయ ప్రచారంలో అస్వస్థ అంటే హుటాహుటిన విజయవాడలో ప్రత్యక్షమయ్యాడు చరణ్.తిట్లీ బాధితులను అడుకోమని చరణ్ కి మీడియా ముఖంగా జనసేనాని అభ్యర్దించగా శ్రీకాకుళంలో కొన్ని గ్రామాలను దత్తతు తీసుకున్నాడు,నిన్న తాజాగా కళ్యాణ్ కరోనా బాధితుల కొరకు 2కోట్లు అంటే బాబాయ్ స్పూర్తితో నేను అంటూ 70 లక్షలు ప్రకటించాడు.

వ్యాపారం,సహాయం:-

మిత్రురాలు,ప్రేయసి,భార్య ఉపాసన తో కలిసి వ్యాపారవేత్తగా కూడా చరణ్ రాణిస్తున్నారు.ఇప్పటికే ‘ట్రూ జెట్’ అంటూ విమాన రంగంలోకి,తనకిష్టమైన గుర్రపు సవారీ అంటూ ‘ఆర్.సి.హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్’ తో ఆ రంగంలోకి అడుగు పెట్టాడు.ఇక చరణ్ గురించి సినిమా రంగం వారిని కడిపితే తన బాబాయ్ పవన్ కళ్యాణ్ లా చరణ్ అడిగిన వారికి ఎప్పుడు కాదనకుండా సహపడుతాడు అంటూ అనేక ఉదాహరణలు చెబుతుంటారు.

తోటి నటి,నటులతో:-

చరణ్ ఇప్పటికే బన్నీ,నవదీప్ లతో కలిసి నటించాడు.వరుణ్ తేజ్,ధరమ్ తేజ్ వంటి తన కుటుంభ హీరోలకు ఎప్పుడు తోడుగా నిలిచాడు.శర్వానంద్,రానా మంచి మిత్రులు.అఖిల్ తో చరణ్ కలిసి తిరగడం బాగానే చూశాం,వీరి మధ్య బంధం గురించి హెలో వేదిక పై వారే చెప్పుకొచ్చారు.ఇక గత కొంతకాలంగా మహేష్,తారక్,చరణ్ తెగ పార్టీలు చేసుకుంటూ వుండడం,ఆ ఫోటోలు బయటకు రావడం మనం చూశాం.ఇక తాజాగా చరణ్,మంచు మనోజ్ సినిమా ప్రరంభ వేడుకకు హాజరవ్వడం.ఆ తర్వాత మనోజ్,”నా ప్రాణ మిత్రుడు చరణ్” అని సంభోదించాడు.ఇలా తోటి హీరోలతో చరణ్ బాగా కలిసిపోయాడు.

కథానాయికలు తమన్నా,కాజల్,కీయారా అద్వానీ వంటి వారు చరణ్ మంచి మిత్రుడు అని పలు సందర్భాలలో తెలిపారు.

చివరిగా:-

నటనలో చిరంజీవి,మంచితనంలో పవన్ కళ్యాణ్ కలగలిసి మెగా పవర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న ‘సురేఖ కుమారుడిని’ చూసి ఆ ‘అంజన పుత్రులు’ గర్వపడుతున్నారు.అలాంటి రామ్ చరణ్ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని,చిత్ర పరిశ్రమకు ఎప్పుడు ఇలానే తోడుండాలి అని,తనదైన హిట్లతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చెయ్యాలి అని కోరుకుంటూ అటు చిత్ర పరిశ్రమ తరుపున,ఇటు ప్రేక్షకుల తరపున,మరి ముఖ్యంగా మెగాభిమానుల తరపున మా “బి.ఆర్ మూవీ జోన్” బృందం తరపున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు..!