24-01-2022 16:51:51 About Us Contact Us

ఎందరో కళామ తల్లి ముద్దు బిడ్డలు,మరెందరో ప్రేక్షకులు అందరికి వందనాలు..!

ప్రపంచానికి సినిమా ఒక వినోదం,కానీ ఒక సినిమా తెర మీద కనిపించే నటి,నటులు,నృత్య కళాకారులు,పోరాట యోధులతో పాటు తెర వెనుక పని చేసే దర్శక,సంగీత,ఎడిటింగ్, గ్రాఫిక్స్, డబ్బింగ్ విభాగాలు అంటూ ఎందరికో ఉద్యోగ అవకాశం ఇస్తుంది.ఇవి కాకుండా సినిమా ప్రారంభానికి ముందు ఆఫీస్ లో పని చేసే ఆఫీస్ బాయ్ నుండి విడుదలకు ముందు పోస్టర్స్ అతికించే వారి వరకు మరెందరికో పని కలిపిస్తుంది సినిమా.

88 సంవత్సరాల తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎందరినో ఆయా విభాగాలకు స్టార్ లను చేసింది,మరెందరికో ఉద్యోగావకాశాలను కలిపించింది.డిజిటల్ యుగంలో మన తెలుగు సినిమా స్థాయి రాష్ట్రాలు,దేశాలు, ఖండాంతరాలు దాటేసింది.ఒక పక్క ప్రజలకు వినోదం అందిస్తూ,మరో పక్క అనేక కుటుంబాలకు జీవనాధారంగా మారిన తెలుగు చిత్ర పరిశ్రమ “ఇంతింతై వటుడింతై” అన్నట్లు ప్రతి సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూ ఒక ప్రాంతీయ పరిశ్రమ నుండి నేడు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరిగే పరిశ్రమగా మారింది.

అటువంటి చిత్ర పరిశ్రమ విషయాలు తెలుసుకునేందుకు ప్రజలు సహజంగానే ఆశక్తి కనబరుస్తున్నారు.కేవలం చిత్ర పరిశ్రమ విశేషాలు అందించేందుకే ఎన్నో మ్యాగ్జైన్లు పుట్టుకొచ్చాయి.డిజిటల్ జమానలో అనేక వెబ్సైట్లు,యూట్యూబ్ ఛానల్ లు వెలిశాయి.ఇప్పటికీ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో సినిమా వార్తలు మాత్రమే చదివే,చూసే పాఠకులు,వీక్షకులు వున్నారు.నిత్యం సినిమా ప్రకటనల రూపంలో ప్రింట్,ఎలక్ట్రానిక్,మరియు సోషల్ మీడియాకు ఎన్నో లక్షల రూపాయలు పరిశ్రమ ఇస్తుంది.కానీ అదే చిత్ర పరిశ్రమలోని వ్యక్తి ఒక చిన్న తప్పు చేసినా,ఆ వార్తకు ఇవ్వాల్సిన దానికంటే మించిన ప్రాధాన్యత ఇస్తుంటారు.

నేను,ఒక వెబ్సైట్ ప్రారంభించనునట్లు కొంత మందితో పంచుకున్నపుడు నాకు వారు చెప్పిన మాటలు కొంచెం కష్టపడితే బాగా డబ్బులు వస్తాయి.సినిమాకు రేటింగ్,రివ్యూ ఇవ్వు ప్రొడ్యూసర్స్ నుండి డబ్బులు డిమాండ్ చెయ్యి,గాసిప్స్ బాగా రాయి,వ్యక్తిగతంగా ఎవరైనా తప్పు చేసి దొరికితే ఒక్కటికి పది ఆర్టికల్స్ రాయి ఎక్కువ మంది చూస్తారు అని సలహా ఇచ్చారు. అంటే సినిమా విశేషాలు,నటి,నటుల,సాంకేతిక నిపుణుల నైపుణ్యాలను దాటి వారి వ్యక్తిగత విషయాల పై కొంతమంది ఎక్కువ దృష్టి పెడుతున్నారు.వాటికే ప్రజల నుండి కూడా భారీ స్పందన వస్తుండడంతో వాటికి ప్రాధాన్యత మరింత పెరిగిపోయింది. మరో పక్క ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా తొలి రోజు తొలి ఆట వరకే ప్రచారం,ఆ తర్వాత సినిమా బాగుందో లేదో ప్రేక్షకులు నిర్దారించేస్తారు. కానీ రివ్యూ,రేటింగ్ అంటూ అక్కడ కూడా కొందరు…,

ఈ వెబ్సైట్ లో కేవలం సినిమా విషయాలు, నటి,నటుల,సాంకేతిక నిపుణులు సినిమాకు వారందించిన సేవలు గురించి,కొత్త తరంలో కొత్తవారిని ప్రోత్సహించడం మాత్రమే తప్ప వారి వ్యక్తి గత విషయాలు,చిత్రం విడుదల అనంతరం రివ్యూలు అంటూ ఎటువంటి వ్యాసాలు రాయబడవు. చిన్నతనం నుండి పత్రికలు చదవడం,వార్తలు చూడడం,వ్యాసాలు రాయడం ఇష్టం,మరో పక్క వయసు పెరిగే కొద్ది చిత్ర పరిశ్రమపై ఆశక్తి పెరుగుతుండడంతో చిత్ర పరిశ్రమ గురించి వార్తలు రాసేందుకు వెబ్సైట్ ప్రారంభించాలి అని భావించాను.ఏమి చేసినా మనదైన ముద్ర ఉండాలి అని ఎవరైనా భావిస్తారు నేను అలాగే నా ధోరణిలో వెళ్ళేందుకు సిద్ధపడి,బ్రేక్ ది రూల్స్ అని నామకరణం చేశాను.చిత్ర పరిశ్రమ నాకు అర్థమైన విధానం,నేను చూసిన కోణంలో వ్యాసాలు రాస్తాను.నా వ్యాసాల పై మొహమాటం లేకుండా మీ అభిప్రాయాలను నాతో పంచుకుంటారని,నచ్చితే షేర్ చేసి ఆదరిస్తారు అని భావిస్తూ

ధన్యవాదాలు,
సెలవు.
మీ
నిఖిల్ కార్తీక్,
సంపాదకుడు.