05-12-2020 14:51:07 About Us Contact Us



యూట్యూబ్ లో పరిచయమై.. వెండితెరపై అలరించి.. ఇప్పుడు ఓ.టి.టి లలో సైతం దూసుకుపోతున్న మన తెలుగమ్మాయి చాందిని చౌదరి.అందం.. అభినయం.. కలగలిసిన అభినేత్రి.కైలాషగిరి పర్వతాలలో షార్ట్ ఫిల్మ్ షూటింగ్ చేస్తుంటే దూరం నుంచి ఒక వ్యక్తి చూస్తున్నాడని సిగ్గుతో డైలాగ్ చెప్పడం ఆపేసిన దగ్గర నుండి ఇప్పుడు వందల మంది మధ్యలో నిర్భయంగా నటించే స్థాయికి చేరిన చాందిని నేడు (అక్టోబర్ 23) పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం.


చిన్నతం నుండి చదువుతో పాటు క్రీడల్లో రణించింది చాందిని.ఇంజినీరింగ్ లో అమ్మాయిలు అతి తక్కువగా ఉన్న మెకానికల్ తీసుకోవడంలోనే తెలుస్తుంది ఆమెకు నచ్చింది చేసే నైజం.. దేనికి బయపడని గుణం.బిటెక్ చదువుతూ తనకు నచ్చిన చిత్ర పరిశ్రమ వైపు అడుగు వేసేందుకు షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులకు పరిచయమైంది.థి వీక్(the week) అనే షార్ట్ ఫిల్మ్ లో (రాజ్ తరుణ్ తో) 2011లో తొలిసారి కనిపించారు.అక్కడ నుండి ఎంతోమంది తెలుగు యువకుల మనసును కొల్లగొట్టారు.


చాందిని చౌదరి షార్ట్ ఫిల్మ్ విడుదలవుతుందంటే ఆ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో మంచి హడావిడి ఉండేది.ఇప్పుడంటే యూట్యూబ్.. ఇంస్టాగ్రామ్.. టిక్ టాక్ లో అనేకమంది అమ్మాయిల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ..ఆ రోజుల్లో యూట్యూబ్ లో తెలుగు అమ్మాయి అంటే అందరికి గుర్తుకొచ్చే ఒకే ఒక్క పేరు చాందిని చౌదరి.2014లో వచ్చిన మధురంతో.. ఆ రోజుల్లో కాలేజీ చదివే విద్యార్థులకు ఆమె ఒక డ్రీమ్ గర్ల్ గా మారిపోయారు.



అప్పుడే తెలుగు చిత్రపరిశ్రమ నుండి అవకాశాలు వచ్చినా ఇంట్లో వాళ్ళు చదువు ముందు అనడంతో చదువు పూర్తి చేసుకొని పరిశ్రమ వైపు అడుగులు వేశారు. 2015లో “కేటుగాడు”తో తెరంగ్రేటం చేసి.. “శమంతకమణి” ధరించి “హౌరా బ్రిడ్జి” పై “కుందనపు బొమ్మ” లా “మను” తో కలిసి “కలర్ ఫోటో” దిగేందుకు సిద్ధంగా ఉంది.


అటు వెండితెరపై సంవత్సరానికి ఒక సినిమా చేస్తూనే.. కొత్తగా వచ్చిన ఓటీటీ లలో సైతం వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించారు చాందిని.ఇప్పటికే “గాడ్స్ ఆఫ్ ధర్మపురి”.. “మస్తిస్” తో వెబ్ సిరీస్ చూస్తున్న నేటి తరం యువతకు బాగా చేరువయ్యారు.నేడు.. తన పుట్టినరోజున విడుదల కానున్న కలర్ ఫోటో సినిమా తో అటు పెద్దవారికి.. ఇటు యువతకు మరింత చేరువకనున్నట్లు విడుదలైన టీజర్.. పాటల తో అర్ధమవుతుంది.


పరాయి భాషల్లో అవకాశాలు వస్తున్నా.. కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేస్తుంది.ఆమె కథల ఎంపిక చూస్తుంటే నాకు నిత్యా మీనన్ గుర్తుకొస్తుంది.ఎన్ని సినిమాలు చేశాం అని కాదు.. చేసిన పాత్రల వల్ల.. మనం ఎంత ప్రభావం చూపాము అనే సిద్ధాంతం బాగా నమ్ముతున్నట్లు కనిపిస్తుంది.అవకాశం దొరికినప్పుడల్లా తెలుగు హీరోయిన్లు దొరకడం లేదని చెప్పే మన చిత్ర పరిశ్రమ పెద్దలకు.. దర్శకనిర్మాతలకు.. చాందిని చౌదరి ఎందుకు కనపడటం లేదనేది బదులు దొరకని ప్రశ్న..!


అప్పుడప్పుడే ఇంటర్నెట్.. స్మార్ట్ ఫోన్స్ వినియోగం పెరుగుతున్న రోజుల్లో ఒక తెలుగు అమ్మాయి ఇంట్లో వాళ్ళని ఒప్పించి.. షార్ట్ ఫిలిమ్స్ లో నటించి.. ప్రేక్షకులను మెప్పించి.. యూట్యూబ్ లో తొలి లేడీ స్టార్ గా ఎదిగటం.. షార్ట్ ఫిలిమ్స్ క్వీన్ అనే పేరు సంపాదించటం చాలా గొప్ప విషయం.9ఏళ్ళుగా ప్రేక్షకులను అలరిస్తున్న క్వీన్ చాందిని చౌదరి.. రానున్న రోజుల్లో వెండితెర పై విభిన్న పాత్రలు చేసి చిత్ర పరిశ్రమలో సైతం ప్రకాశించాలని కోరుకుంటూ.. నేడు(అక్టోబర్ 23న)పుట్టిన రోజు జరుపుకుంటున్న చాందిని చౌదరి గారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున పుట్టిన రోజు శుభాకాంశాలు..!