03-12-2020 22:35:57 About Us Contact Us



నరేష్.. అల్లరి నరేష్.. తెలుగు ప్రేక్షకులను తమ కుటుంబ సభ్యులతో మనసారా నవ్వుకునేలా చేసిన ఈ.వి.వి. సత్యనారాయణ గారి అబ్బాయి.. తొలి సినిమా తోనే తన పేరుకు ముందు టైటిల్ తగిలించుకున్న హీరో.. కామెడీ మాత్రమే కాదు విలన్ గా కూడా చేయగలను అని రుజువుచేసిన నటుడు.. అప్పట్లో రాజేంద్రప్రసాద్ గారు ఇప్పట్లో అల్లరి నరేష్ అనే స్థాయికి ఎదిగిన కామెడీ కింగ్.. మన సడన్ స్టార్.. అలాంటి స్లిమ్ స్టార్ అల్లరి నరేష్ గారి పుట్టినరోజు నేడు..


1982లో చెన్నైలో జన్మించిన నరేష్.. తన విద్యాబ్యాసం కూడా అక్కడే చేశారు. పరిశ్రమ హైదరాబాద్ వచ్చిన క్రమంలో కుటుంబంతో పాటు హైదరాబాద్ చేరారు నరేష్.. ప్రముఖ దర్శకుడు ఈ.వి.వి. సత్యనారాయణ గారి అబ్బాయి నరేష్ హీరోగా.. ప్రముఖ నటులు చలపతిరావు గారి అబ్బాయి రవి బాబు దర్శకత్వం లో సినిమా అనే వార్త అప్పట్లో టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయింది.. 2002లో అల్లరి పేరుతో ఆ సినిమా విడుదలైంది.. సినిమా భారీ విజయం సాధించింది.. నాటి నుండి ఆయన పేరుకు ముందు అల్లరి చేరిపోయింది.. అల్లరి నరేష్ గా మారిన నరేష్.. తొట్టి గ్యాంగ్.. మా అల్లుడు వెరీ గుడ్.. డేంజర్.. కితకితలు.. గోపి గోడ మీద పిల్లి.. సీమశాస్ట్రీ సినిమాలతో మంచి విజయాలు సాధించారు.. 2002 నుంచి 2007 వరకు 18 సినిమాలు చేశారు..


2008లో ఒక పక్క తన స్పీడ్.. మరో పక్క తన నటనా వైవిధ్యం.. అటు పరిశ్రమకు.. ఇటు ప్రజలకు.. తెలియ చేశారు నరేష్. నేటి తరం ఏ హీరో చేయలేని విధంగా ఒక సంవత్సరంలో తాను నటించిన 8 సినిమాలు విడుదలయ్యాయి. అందులో విశాఖ ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరో గా మాత్రమే కాకుండా ఒక నెగటివ్ పాత్రలో కనిపించారు.. ఆ సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.. అదే సంవత్సరం విడుదలైన మరో సినిమా గమ్యం.. శర్వానంద్ తో కలిసి నటించిన ఆ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు నరేష్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. అదే సంవత్సరం బాపు..రమణ గార్ల సినిమా సుందరఖండ లో సైతం నటించారు. నేటి తరం హీరోలలో ఎవరికి ఆ అవకాశం దక్కలేదు. అలా 2008లో అనేక రికార్డులు అందుకున్నారు నరేష్.



ఆ తర్వాత వరసగా కామెడీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు నరేష్. 2012లో వచ్చిన సుడిగాడు.. ఒక టికెట్ తో వంద సినిమాలు అనే శీర్షక సినిమా నరేష్ ను సడన్ స్టార్ గా మార్చేసింది.. 100 సినిమాల పేరడీ తో తీసిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసుకుంది. 2013లో దేశంలోనే తొలి కామెడీ 3డి సినిమా చేశారు నరేష్. 2014లో లడ్డు బాబు తో భారీ ఆకారంలో కనిపించి నవ్వించారు నరేష్. ఇలా కామెడీ సినిమాలలో సైతం భిన్నంగా.. తనదైన ముద్ర ఉండేలా సినిమాలు చేశారు నరేష్.


2019లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో పల్లెటూరు పాత్రలో చాలా బాగా చేసి.. అందరిని అలరించారు నరేష్. 2004లో తను నటించిన నేను సినిమా పాత్రకు ఈ పాత్ర దగ్గరగా ఉంటుంది.. ఇప్పుడు తాజాగా నాంది సినిమాతో మరో విలక్షణ పాత్రకు శ్రీకారం చుట్టినట్లు పోస్టర్స్ చూస్తే తెలుస్తుంది.. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా నాంది టీజర్ విడుదల కానుంది.. అలానే తాను నటించిన మరో సినిమా బంగారు బుల్లోడు సినిమా టీజర్ సైతం నేడే విడుదల కానుంది..


18 ఏళ్ళ సినీ ప్రస్థానం.. 57 సినిమాలతో మనని అలరించిన కామెడీ కింగ్.. సడన్ స్టార్.. స్లిమ్ స్టార్.. అల్లరి నరేష్ గారు ఇలానే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని.. మనల్ని ఇలానే అలరించాలని.. భారీ విజయాలు నమోదు చేయాలని ఆసిస్తూ.. మా బి.ఆర్. మూవీ జోన్.. తరపున జన్మదిన శుభాకాంక్షలు..!